సిద్దిపేట రూరల్, వెలుగు: ఉద్యోగమిత్ర యువత భవిష్యత్తుకు దృఢమైన పునాది అని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. శనివారం సిద్దిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్ లో సీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట పోలీస్ ఉద్యోగమిత్ర మెగా జాబ్ మేళాను ఘనంగా నిర్వహించి, 624 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు శాఖ బాధ్యతలు కేవలం శాంతిభద్రతల పరిరక్షణతో మాత్రమే పరిమితం కాకుండా, సమాజ శ్రేయస్సులో భాగస్వామ్యం వహించడం కూడా తమ కర్తవ్యం అన్నారు.
యువతను సరైన దిశలో నడిపిస్తూ, వారి భవిష్యత్తుకు దృఢమైన పునాది వేయడం కోసం ఉద్యోగ మిత్ర కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తోందని, ఒకే రోజు 624 మందికి ఉపాధి అవకాశాలు లభించడం ఎంతో ఆనందదాయకం అన్నారు. కాగా ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 65 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ట్రైనీ ఐపిఎస్ ఆయేషా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

